logo:premalayam_eluru

ప్రేమాలయం - వృద్ధుల ఆశ్రమం - ఏలూరు


మా గురించి
           ధ్యానం నుంచి జ్ఞానం. . . . జ్ఞానం నుండి దయాగుణం, దాతృత్వం, మంచి, మానవత్వం పెంపొందుతాయనడానికి నిదర్శనగా ఆవిర్భవించినదే ప్రేమాలయం. సిద్ధ సమాధి యోగ (SSY) ద్వారా ధ్యాన సాధనలో నిమగ్నమైన మిత్రబృందం సభ్యుల మనసుల్లో ఒక సేవా భావ యోజన మెరుపులా మెరిసింది. 'స్వంత లాభం కొంత మానుకుని పొరుగు వాడికి తోడ్పడవోయి' అన్న గురజాడ పలుకులను స్ఫూర్తిగా తీసుకున్న మిత్రబృందం వృద్ధాశ్రమ స్థాపనకు సంకల్పించింది. ఆ సంకల్ప ఫలమే ప్రేమాలయం. యోగా, జ్ఞాన సాధకులైన ఆ మిత్ర బృందంలోని ప్రతి ఒక్కరూ 'నేను సైతం' అంటూ ముందుకు వచ్చి ప్రేమాలయం నెలకొల్పడంలో చేయూతనందించారు.

              కన్న కొడుకులు, కూతుళ్లు, అయిన వాళ్ళు పట్టించుకోకుండా వదిలివేయడంతో నిలువ నీడ లేక, తినడానికి తిండి లేక అలమటిస్తున్న వృద్ధమాతలను చేరదీసి, అక్కున చేర్చుకుని, ఆశ్రయం కల్పించి, వారికి అన్న పానాదులను సమకూర్చాలనే లక్ష్యంతో ప్రేమాలయం ఆవిర్భవించినది. 1997లో ఒక పూరిపాకలో చిన్న మొక్కలా మొలకెత్తిన ప్రేమాలయం ఇప్పుడు ఎందరో వృద్దమాతలకు నీడనిచ్చే వటవృక్షమై అలరారుతోంది. చిరు ఆశ్రమంలా ఆరంభమై మూడు అందమైన భవనాలతో సువిశాల ప్రాంగణంగా వృద్ధి చెందడంలో ఎందరో త్యాగధనుల త్యాగనిరతి, మరెందరో వధాన్యుల దానశీలత దాగి ఉన్నాయి.

        ప్రేమాలయం నెలకొల్పడానికి సొంత ఆస్తిని సైతం తెగ నమ్మి నిధులు సమకూర్చిన త్యాగమూర్తులు, తమ స్వంత స్థలాలను విరాళంగా ఇచ్చిన వదాన్యులు, సహృదయంతో చేతికి ఎముక లేకుండా ఆర్థిక సహాయం అందించిన దాతలు. . . . ఇలా ఎందరో మహనీయులు. . . . అందరూ ప్రేమాలయం అభివృద్ధికి రాళ్ళెత్తిన మహానుభావులే! పూరిపాక స్థాయి నుండి నేడు విశాల ప్రాంగణంలా వృద్ధి చెంది, సకల సదుపాయాలతో వృద్ధమాతలకు ఆశ్రయం కల్పిస్తున్న ప్రేమాలయం 2022 ఏప్రిల్ 16,17 తేదీలలో రజిత ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం హర్షదాయకం. వృద్ధులకు సేవ చేయాలని భావన కలిగిన ప్రతి ఒక్కరికి సంతోషదాయకం.

                యోగ, ధ్యాన, ఆధ్యాత్మిక మార్గాలలో వృద్ధమాతలకు సేవలు అందించడమే కాక, వారికి అవసరమైన ఆహారం, వసతి, వైద్య సదుపాయాలు ప్రేమాలయం కల్పిస్తోంది. తాము ఒంటరివాళ్ళం కాదు అనే భావన వృద్ధమాతల దరిచేరకుండా ప్రేమాలయం నిర్వాహకులు, సిబ్బంది, సేవకులు నిరంతరం కృషి చేస్తున్నారు.

           ఏలూరు నగరంలోని వారే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4000 మంది శాశ్వత అన్నదాన పథకానికి ఉదారంగా విరాళాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నందువల్ల వృద్ధమాతలకు ఆహారం, వైద్య సదుపాయాలు సమృద్ధిగా సమకూర్చగలుగుతున్నామని నిర్వాహ కమిటీ కృతజ్ఞతాపూర్వకంగా తెలియజేస్తోంది. పుట్టినరోజు, పెళ్లి రోజుల సందర్భంగానూ, తమ దివంగత ఆప్తుల జ్ఞాపకార్థంగానూ అనేకమంది ప్రేమాలయానికి విచ్చేసి వృద్దమాతల ఆశీస్సులు అందుకుని తరిస్తూ ఉంటారు. ఆ సందర్భాల్లో వారు వృద్ధమాతలకు చీరలు, మిఠాయిలు, పళ్ళు అందజేస్తారు. మరి కొంతమంది సేవా తత్పరులు ప్రేమాలయానికి వచ్చి వృద్ధమాతల యోగక్షేమాలు తెలుసుకొని, వారికి సపర్యలు చేయడం కూడా చేస్తున్నారు. ఇటువంటి సేవా తత్పరులకు ప్రేమాలయం ద్వారాలు ఎల్లప్పుడూ తెరచే ఉంటాయి.


Copyright © Premalayam Eluru 20-Nov-2025